Home  »  Featured Articles  »  ఎన్టీఆర్ వేణు గానానికి 50 ఏళ్లు.. ప్రేక్షకులు మెచ్చిన చక్కని ప్రేమకథ ‘ఆరాధన’!

Updated : Mar 12, 2026

‘నా మది నిన్ను పిలిచింది గానమై.. వేణు గానమై..’ అంటూ మహ్మద్ రఫీ ఆలపించగా, నటరత్న ఎన్.టి.రామారావు అభినయించిన తీరు అసామాన్యం, అద్వితీయం. ఇప్పటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఎంతో మంది పాడుకుంటూ ఉంటారు. అంతటి అద్భుతమైన పాట ‘ఆరాధన’ చిత్రంలోనిది. 1976 మార్చి 12న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సమయానికి విడుదలైన మిగతా సినిమాలన్నింటినీ పక్కకు నెట్టి విజయ ఢంకా మోగించింది ‘ఆరాధన’. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 

1970లో రాజేంద్రక్రుమార్, మాలా సిన్హా జంటగా రామానంద్ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘గీత్‌’ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలతో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎ.పుండరీకాక్షయ్య తెలుగులో ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేశారు. 

ఎన్.టి.రామారావు, వాణిశ్రీ జంటగా నటించిన ‘ఆరాధన’  1976 మార్చి 12న విడుదలై తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘మేరే మిత్‌వా.. మేరే మీత్‌రే..’ పాటను ‘నా మది నిన్ను పిలిచింది గానమై’గా సంగీత దర్శకుడు ఎస్.హనుమంతరావు రీమిక్స్ చేశారు. ఈ సినిమాలోని పాటలన్నీ మహ్మద్ రఫీ పాడటం విశేషం. 

అప్పటికే పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల పాలిట ఆరాధ్య నటుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్న‌ ఎన్టీఆర్ ఈ చిత్రంలో గోపీ అనే దివ్యాంగుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. అలాగే గోపీ ప్రియురాలు రాధ‌గా వాణిశ్రీ తన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘నా మది నిన్ను పిలిచింది గానమై..’ అనే పాట సినిమాలో ఐదు సార్లు వినిపించడం విశేషం. 

సంగీత ప్రధానంగా రూపొందిన ప్రేమక‌థా చిత్ర‌మిది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో 168 రోజులు ఆడటం విశేషం. ఈ చిత్రం విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, రామానంద్ సాగర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆ తర్వాతి కాలంలో ‘రామాయణ్‌’ సీరియల్‌తో ఎంతో పేరు తెచ్చుకున్నారు రామానంద్ సాగర్. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోపీ (ఎన్టీఆర్) చెల్లెలితో కలిసి మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వేణువు వాయించడం, పాటలు పాడటం అతడికి అలవాటు. గోపి ప్రతిభను చూసిన రంగస్థల కళాకారిణి, గాయని రాధ (వాణిశ్రీ) అతనికి దగ్గరవుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోపీలోని ప్రతిభతో నగరంలో డబ్బు సంపాదించవచ్చు అని సలహా ఇస్తుంది. కానీ, గోపీ అలా చేసేందుకు ఒప్ప్పుకోడు. ఇదిలా ఉంటే.. రాధ పని చేసే కంపెనీ యజమాని సుధాకర్ (జగ్గయ్య) ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. గోపీతో తను ప్రేమలో ఉన్నానని చెబుతుంది రాధ. 

డబ్బు కోసం పట్టణానికి వెళ్ళడానికి మొదట నిరాకరించిన గోపీ తన చెల్లెలి పెళ్లి కోసం రాధ సహాయం కోరతాడు. ఇవన్నీ చూస్తూ సహించలేని సుధాకర్.. గోపిపై దాడి చేయిస్తాడు. ఆ ఘటనలో గోపీ స్వరం పోతుంది. మూగవాడిగా పాటలు పాడలేని స్థితిలో ఉన్న గోపీ జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలేంటి? గోపీ, రాధ పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా కథ. 
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.